మనుజాధీశుల కెల్లను
జనకుడు ప్రకటించె నెవరు చప్పున ఈ
ధనసును సంధించ గలరొ
తనయకు తగువరుడవు నిది తధ్యము ననియెన్ 24
పెక్కురు రాజులు విల్లును
ఎక్కువ గర్వముతొ వచ్చి నెత్తగ లేకన్
అక్కసుతొ తిరిగి వెళ్లిరి
చిక్కునె రామునికి తప్ప సీత, విధిలిఖితముగా 25
గురువు విశ్వామిత్రుడు
పురమాయించగ దశరథ పుత్రుండతి ని
బ్బరముగ ధనసును పైకె
త్తి రయమున విరిచె జనులునుదిశలున్నదరన్ 26
వరమాలతొ సీతనిటు
త్వరగా తెండని జనకుడు తత్తర పడగా
వరుడవ రాముడు తండ్రి ద
శరధుని అనుమతి యులేక సందేహిన్చెన్ 27
జనకుడు విశ్వామిత్రుని
పనుపున దూతలనయోధ్య పంపె ,దశరథున్
వినయముగ నాహ్వానిం
చి ,నిచటి శుభవార్తనచట చెప్పగ వేగన్ 28
దశరధునితొ దూతలు సభలొ
కుశలమునడిగియు,జనకుడు మిధిలా పతి నొ
క్కశుభ మగు వార్తను తమకు
విశదము చేయగను పంపె వివరింతు మిటన్ 29
రాముడు లక్ష్మణుండు, ముని రాక్షస బాధలు లేక యజ్ఞమున్
క్షేమముగాను సాగగను చేసిరి సాయము నంచు, పిమ్మటన్
ఆ ముని వెంటయున్ మిథిల రాజ్యము వెళ్లియు రాముడచ్చటన్
భూమిజ సీతకై ధనసు పోటిలొ నెగ్గె నయోధ్య భూవరా ! 30
తమరు నెల్లరు మిధిలకు తక్షణంబె
బయలు దేరియు వచ్చుట భావ్య మనియు
వినయముగ జనక మహ రాజు విన్నవించె
అనియు దూతలు చెప్పగ నాలకించి 31
కొడుకుల జాడలు తెలిసియు
కడువేడ్కతొ దూతలకును కానుక లిడియున్
పుడమిపతియు దశరధుడును
వడిగా వత్తు మచటికని వారికి తెల్పెన్ 32
గురువు,కుటుంబ సభ్యులును, గుఱ్ఱములేనుగులెన్నొతేరులున్
అరుదగు వేదపండితులు పాటలు పాడెడి బృందముల్ కడున్
చురుక గయోధ్య నుండి చన చూసి జనంబులు పూలు చల్లగా
ఎరిగియు వారి రాక మిథిలేశుడు వచ్చియు గౌరవించెగా 33
ఇరువైపు పెద్దలందరు
పరిశీలించియు వారి వంశ వివరముల్
సరియగు సీతయు రాముని
పరిణయ మని నిర్ణయించి ప్రస్తుతులిడగా 34
ఆ సమయమున పెద్దలు లక్ష్మ ణునికి
సీత చెల్లియు ఊర్మిళను ఇత్తు మనగ
మరియు భరత శ తృఘ్నుల మాట వచ్చి
జనకు సోదరుని తనయలు జతయు అనిరి 35
జనకునికి సీత దొరకగ
కనిపెంచిన ఊర్మిళయను కాగా నిరువుర్
అనుజుడు కుశధ్వజు, డతని
కిని మాండవియు శృత కీర్తి, ఇద్దరు తనయల్ 36